Friday, August 19

శ్రీకృష్ణాష్టమి

ద్వాపర యుగం, శుక్ల నామ సంవత్సరంలో, శ్రావణమాసం, బహుళపక్షం, రోహిణి నక్షత్రం. అష్టమినాడు, రెండు ఝాముల రాత్రివేళ, మేనమామ గండంతో చిన్నికృష్ణుడు జన్మించాడు. జయంతి అంటే రాత్రి అనే అర్ధాన్ని బ్రహ్మాండపురాణం తెలుపుతోంది. కృష్ణుడు జన్మించిన అష్టమికి కొందరు ప్రాధాన్యం ఇస్తే, మరికొంతమంది రోహిణి నక్షత్రానికి ప్రాధాన్యమిచ్చారు. ఈ కారణాలవల్ల ఒకరోజు అటుఇటు కృష్ణాష్టమిని జరుపుకొంటారు.


కృష్ణాష్టమి రోజు చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలని, బంగారు లేదా వెండితో తయారుచేసిన చంద్రబింబాన్ని వెండి/బంగారు పాత్రలో ఉంచి పూజించి ఆర్ఘ్యమిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని పెద్దలంటారు. తరువాత శ్రీకృష్ణుని పూజ చేయాలి.
లీలామానుషధారుడైన ఆ బాలకృష్ణుని బాల్యక్రీడలను మాత్రమే భక్తులు ఎక్కువగా స్మరించుకొంటారు, అందుకు గుర్తుగా ఉట్లు కొట్టడం, చిన్నపిల్లలను కృష్ణునిలా అలంకరించి వారి పాదాలతో చిన్నిచిన్ని అడుగులు వేయించి, ఆ బాల కృష్ణుని అడుగులవలే భావించి, కృష్ణుడే తమ ఇంటికి వచ్చాడనే తీయ్యని అనుభూతిలో మునిగిపోతారు.

ఈ రోజున స్వామికి నైవేద్యంలో మినపపిండితో పంచదారను కలిపి చెసిన పదార్ధాన్ని పెడుతారు. మరికొందరు శొంఠి, బెల్లంపానకం, నెయ్యితో కలిపి చేసిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెడ్తారు. ఆరో ఏట గోపికా వస్త్రాపహరణం, ఏడో ఏటనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం చేసిన కన్నయ్య జన్మించినది అర్ధరాత్రి కాబట్టి జన్మదినోత్సవాన్ని అర్ధరాత్రి జరుపుకోవడం పద్దతి. కృష్ణ విగ్రహాన్ని పొన్నపూలతో పూజ, 16 పిండివంటలతొ నైవెద్యం పెట్టడం ఆచారం.

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానస రాజహంసః||
ప్రాణ ప్రయాణ సమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||
ఓ కృష్ణా! మరణ సమయంలో నిన్ను స్మరిస్తూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది. కాని! ఆ వేళ కఫవాత పైత్యాలతో కంఠం మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శత్రు అభేద్యమైన 'నీ పాద పద్మ వజ్రపంజర'మందు ఉంచుతున్నాను తండ్రీ...!

0 వినదగు నెవ్వరు చెప్పిన..: