Wednesday, October 26

కార్తీక మాసం

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

కార్తీకమాసంలో నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు
కార్తీకమాసంలో తెల్లవారుజామున తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీకమాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు. తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందనీ, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న ఆదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ వ్రత విధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి, పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవ్వాలి. నక్షత్రాలు ఉండగానే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కేదారేశ్వర వ్రతం
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే వారు కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తూ నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: